ఏబికె…అక్షరానికి 62 ఏళ్ళు!!

ఏబికె…అక్షరానికి 62 ఏళ్ళు!!
March 30 11:51 2018

Abk Prasad తెలుగునాట సుప్రసిద్ధ పత్రికా సంపాదకులు. ఈనాడు, ఉదయం, వార్త, సుప్రభాతం, మాభూమి, వార్తా పత్రికల రూపకర్త.ఆంధ్రజ్యోతి,ఆంధ్ర ప్రభ,ఆంధ్ర భూమి తదితర పత్రికల రూపశిల్పి. No.1 న్యూస్ ఛానల్ స్వరూపశక్తి…ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘం పూర్వ అధ్యక్షులు.సాక్షి దినపత్రికలో ఇప్పటికీ రాస్తున్న ఏకైక సీనియర్ సంపాదకులు.
ఎందరో శిష్యులు, శిష్యోప శిష్యులు, వందల సంఖ్యలో సహచరులున్న ఏబికె …కలంపట్టి 62 సంవత్సరాలు. జర్నలిస్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మక జి.కె.రెడ్డి అవార్డుతో సహా అనేక అవార్డులు, పురస్కారాలు, బిరుదులు పొందిన ఏబికె ప్రసాద్ కేవలం విలువల కోసం తన కొలువులను తృణప్రాయంగా వదులుకున్న మన కాలపు ఏకైక సంపాదకులు. పుష్కర కాలం పాటు ఎడిటర్ స్తాయిలో కొనసాగినా ప్రస్తుతం సి.ఆర్.ఫౌండేషన్( ఓల్డేజ్ హోం)లో ఉండడమే ఆయన నిజాయితీకి కొలబద్ద. పేదల హక్కులకు భంగం కలిగే ప్రతిసారీ ఏబికె కలం వారికి దన్నుగా నిలిచేది. దళిత ఆత్మగౌరవ ప్రతీక కారంచేడు ఘటనను జాతీయ స్తాయి శీర్షిక చేసింది ఏబికే ప్రసాద్ సంపాదకత్వంలోని ఉదయం మాత్రమే. నిజానికి అప్పటినుంచే బాధిత వర్గాల, కులాల గొంతుకలు పత్రికల్లోకి రావడం మొదలయ్యాయి.బాధిత వర్గాల కోసమే నిలిచిన ఏబికె కేవలం సంపాదకీయాలకే పరిమితం కాకుండా అవసరమైన సందర్భాలలో వారిపక్షంగా న్యాయస్తానాలను ఆశ్రయించిన సందర్భాలు అనేకం. అధికారిక ఒత్తిడులు, ప్రలోభాలు, దైనందిన జీవితంలో ఎదురైన ఒడుదుడుకులు ఏబికెను లొంగదీయలేకపోయాయి, తన శిష్యుల అభిమానం తప్ప. మా సహచర పాత్రికేయ మిత్రులు వి.వి.రమణమూర్తి ఆహ్వానాన్ని మన్నించిన ఏబికె రేపు శనివారం వైజాగ్ లో జరిగే అభినందన కార్యక్రమానికి అంగీకరించారు. రైటర్స్ అకాడమీ నిర్వహించే” ఏబికె అక్షరానికి 62 ఏళ్ళు ” కార్యక్రమానికి జస్టీస్ చలమేశ్వర్ గారు, హిందీ అకాడెమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు ,కేంద్ర సమాచార హక్కు కమిషనర్ మాడభూషి శ్రీధర్ గారు, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ కె.ఆర్.మూర్తి గారు హాజరవుతారు. జర్నలిస్టు మిత్రులు ముఖ్యంగా ఉత్తరాంధ్ర పాత్రికేయులు ఈ గొప్ప కార్యక్రమం విజయవంతం చేయగలరు.అదే సందర్భంలో ఇటీవలే తన జీవన సహచరిని కోల్పోయిన ఏబికె గారికి మానసిక స్తైర్యాన్ని అందివ్వగలరు.‌
(విజయశేఖర్ బుర్రా జర్నలిస్టు)

  Article "tagged" as:
  Categories: