అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష

అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష
March 23 17:45 2018

న్యూఢిల్లీ
సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆయన శుక్రవారం దీక్షకు కూర్చున్నారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. అందరు రాజకీయ నేతలూ మోసగాళ్లేనని ఆయన అన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేతలకు పాలన చేతగావడం లేదు. నా తుదిశ్వాస వరకు పోరాడుతూనే ఉంటాను అని హజారే స్పష్టంచేశారు. తన దీక్షకు నిరసనకారులు రాకుండా అడ్డుకునేందుకు రైళ్లు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వంపై హజారే తీవ్రంగా మండిపడ్డారు. మీరు రైళ్లు రద్దు చేశారు. వాళ్లను హింస దిశగా ప్రేరేపిస్తున్నారు. నాకోసం కూడా బలగాలను రంగంలోకి దించారు. నాకు రక్షణ అవసరం లేదని మీకు ఎన్నో లేఖల్లో చెప్పాను. మీ రక్షణ నన్ను కాపాడదు అని హజారే అన్నారు. అవినీతి కేసుల విచారణ కోసం లోక్‌పాల్‌ను నియమించాలని చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నా కేంద్రం పట్టించుకోకపోవడంపై హజారే అసంతృప్తి వ్యక్తంచేశారు. తన దీక్షను ప్రారంభించే ముందు ఆయన రాజ్‌ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఆ తర్వాత 2011లో తాను అవినీతిపై పోరాటం మొదలుపెట్టిన చోటు అయిన రామ్‌లీలా మైదానానికి వెళ్లి దీక్షకు కూర్చున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్, రాజ్‌గురు,సుఖ్‌దేవ్‌లను బ్రిటిష్ వాళ్లు ఉరితీసిన రోజు అయిన మార్చి23నే తాను దీక్షకు కూర్చుంటానని గతంలోనే హజారే ప్రకటించారు