కేరళ టూరిజంపై లండన్ లో ప్రచారం

కేరళ టూరిజంపై లండన్ లో ప్రచారం
March 13 19:10 2018

లండన్,
కేరళ టూరిజం లండన్ వీధుల్లో తిరుగుతోంది. ముఖ్యంగా సెంట్రల్ లండన్‌లోని పాదచారులు, ప్రయాణికులను కేరళ టూరిజం పలకరిస్తోంది. కేరళ పర్యాటక శాఖ కొత్త తీసుకొచ్చిన ‘బస్ బ్రాండింగ్’ ప్రచారం బాగా కలిసి వస్తోంది. కేరళ టూరిజంను ప్రచారం చేస్తూ ఐదు పెద్ద డబుల్-డెక్కర్ బస్సులు సెంట్రల్ లండన్ వీధుల్లో తిరుగుతున్నాయి. ‘గో కేరళ’ హ్యాష్‌ట్యాగ్‌తో ఇక్కడి సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా బస్సులపై ఏర్పాటుచేసిన ప్రచార చిత్రాలు కట్టిపడేస్తు్న్నాయి. లండన్ బస్సులపై ఈ ప్రచారం మార్చి చివరి వరకు కొనసాగుతుంది.కొత్త మార్కెటింగ్ వ్యూహంలో భాగంగానే ఈ సరికొత్త టూజిరం పాలసీని తీసుకొచ్చినట్లు పర్యాటక శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. తొలి ప్రయత్నంలో భాగంగా తొలిసారి లండన్‌లోని రెడ్ బస్సులపై తమ టూరిజం బ్రాండ్‌ను ప్రచారం చేస్తున్నామన్నారు. ఇప్పటికే ఈ ప్రచార చిత్రాల ద్వారా లండన్‌లోని సామాన్య ప్రజలను, ప్రయాణికుల దృష్టిని కేరళ టూరిజం తన వైపు తిప్పుకుందని వెల్లడించారు. కేరళ టూరిజంను కళ్లకు కట్టేలా ఐదు బస్సులపై కేరళ సరస్సులు, హౌస్‌బోట్స్, కథాకళి దృశ్యాలను ఏర్పాటుచేశారు. అలాగే ‘గో కేరళ’ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్ keralatourism.org కూడా ఉంచారు.వాస్తవానికి యునైటెడ్ కింగ్‌డమ్‌లో కేరళ టూరిజంను ప్రచారం చేయడం ఇది కొత్తేమీ కాదు. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే కేరళ టూరిజం బ్రాండ్‌ను అక్కడి ట్యాక్సీలపై ప్రచారం చేస్తున్నారు. లండన్, బర్మింగ్‌హామ్, గ్లాస్గో నగరాల్లో ట్యాక్సీలపై కేరళ టూరిజం బ్రాండ్ మంచి విజయం సాధించింది. విదేశాల నుంచి కేరళకు వచ్చే పర్యాటకుల్లో యూకే వాసులు చాలా ఎక్కువే. గత కొద్ది సంవత్సరాలుగా చూసుకుంటే 1.5 లక్షలకు పైగా పర్యాటకులు యూకే నుంచి కేరళకు వచ్చారు.యూకేలోనే కాకుండా మధ్య ఆసియా దేశాల్లోనూ కేరళ పర్యాటక శాఖ 2016-17 సంవత్సరంలో ప్రచారం మొదలుపెట్టింది. దుబాయిలో క్యాబ్‌లపై కేరళ టూరిజంను ప్రచారం చేస్తున్నారు. అలాగే సౌదీ అరేబియా, ఒమన్ దేశాల్లోని విమానాశ్రయాల వద్ద కేరళ టూరిజం బోర్డులను ఏర్పాటు చేశారు. బీబీసీ వరల్డ్, అల్ జజీరా ఛానెల్స్ ద్వారా టెలివిజన్ ప్రచారం చేస్తున్నారు. కేవలం దేశంలోని పర్యాటకులపైనే ఆధారపడకుండా విదేశీ పర్యాటకులను ఆకర్షించడానికి కేరళ టూరిజం చేస్తున్న ప్రయత్నం ప్రశంసనీయం. మన తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విధంగా వినూత్నంగా ఆలోచించి విదేశీ పర్యాటకుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నం చేస్తు బాగుంటుంది

  Article "tagged" as:
  Categories: