ఏపీలోనే పవన్ ఉగాది

ఏపీలోనే పవన్ ఉగాది
March 13 19:37 2018

విజయవాడ,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉగాది వరకూ అమరావతిలోనే ఉండనున్నారు. గుంటూరు సమీపంలోని కాజా వద్ద తన ఇంటి పనులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పాత, కొత్తల కలయికతో జనసేన ఉంటుందని చెప్పారు. కొత్త వాళ్లు వస్తే పాత నేతలను పక్కన పెట్టడం జరగదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. సీనియర్ నేతల అనుభవం అవసరమని, అలాగే యువతరం రాజకీయాల్లో ముందుకు రావాలని పవన్ కోరారు. అభిమానులు ముందుకొచ్చి ఈ ఇంటికి అవసరమైన స్థలాన్ని చూపించారని చెప్పారు. ఇక్కడే పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించాలన్న యోచనలో ఉన్నామన్నారు.ఈ నెల 14వ తేదీన జరగబోయే ప్లీనరీలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలిపారు. సమస్యల నుంచి తాను ఎప్పుడూ పారిపోనని, అలాగే ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకూ పోరాటం సాగించాలన్నదే జనసేన లక్ష్యమన్నారు. కాగా జనసేన ప్లీనరీ సమావేశంలో పవన్ కల్యాణ్ సంచలన విషయాలు వెల్లడించే అవకాశాలున్నాయి. పవన్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక పొత్తుతో ఎన్నికలకు వెళుతుందా? అన్న విషయాలను కూడా ప్లీనరీలో పవన్ చెప్పే అవకాశముందంటున్నారు.తాను కొత్త ఇంటిని నిర్మించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన తండ్రి మంగళగిరిలో కానిస్టేబుల్ గా పనిచేసిన విషయాన్ని కూడా పవన్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తనకు ఎవరూ డైరెక్షన్ ఇవ్వడం లేదన్నారు. తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు పవన్ కల్యాణ్ కౌంటర్ ఇచ్చారు. జనసేన వెనక చంద్రబాబు కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఉందన్న వైసీపీ నేతల విమర్శలకు తనకు ఎవరి డైరెక్షన్ అవసరం లేదన్నారు. వైసీపీకి మోడీ దర్శకత్వం వహిస్తున్నారా? అని పవన్ ప్రశ్నించారు. ఒక మాట అనేటప్పుడు ఆలోచించి మాట్లాడాల్సి ఉంటుందన్నారు. తనకు ఎవరి డైరెక్షన్ అవసరం లేదని, ప్రజల డైరెక్షన్ లోనే తాను వెళ్లనున్నట్లు పవన్ స్పష్టం చేశారు. ఈనెల 14వ తేదీన ప్లీనరీ పూర్తయిన తర్వాత కూడా పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉండనున్నారు. ప్రత్యేక హోదాపై ఉద్యమ కార్యాచరణ, పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం వంటి వాటిపై నేతలతో పవన్ చర్చించనున్నారు.

  Article "tagged" as:
  Categories: