పశువులకు బలవర్ధక పోషక దాణా కోసం దాణామృతం

పశువులకు బలవర్ధక పోషక దాణా కోసం దాణామృతం
March 13 20:32 2018

అమరావతి,
రాష్ట్రంలో పశుగణాభివృద్ధితో పాడిపరిశ్రమను గణనీయంగా వృద్ధిలోకి తీసుకువచ్చేందుకు వీలుగా పశువులకు బలవర్ధక పోషకాహారాన్ని చౌక ధరకు అందించేందుకు వీలుగా సబ్బిడీ ఇచ్చి దాణామృత తయారీ యూనిట్లను ఏర్పాటుచేయిస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్, గిడ్డంగులు, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ,మత్స్యశాఖ, సహకార శాఖల మంత్రి సి. ఆదినారాయణ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 యూనిట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు మంత్రి మంగళవారం సచివాలయంలో సబ్సడీ పత్రాలను అందచేశారు. రూ. 61.01 కోట్ల వ్యయంతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్లకు యాభై శాతం సబ్సిడీని పశుసంవర్ధకశాఖ అందచేస్తోంది. పశుసంవర్ధక శాఖ అభివృద్ధి 11 నుంచి 12 శాతంగా ఉందని దీన్ని 20 శాతానికి పెంచాలన్నది ముఖ్యమంత్రి ఆశయమని మంత్రి ఈ సంధర్భంగా వివరించారు. అందుకు అనుగుణంగానే పశుసంవర్ధక శాఖ పశువులకు బలవర్ధక దాణానితయారీని ప్రోత్సహించి పాడిరైతాంగానికి అందచేయాలని నిర్ణయించిందని అన్నారు.జిల్లాకు ఒక యూనిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇప్పుడు 12 యూనిట్లు ఏర్పాటుకు ముందుకు వచ్చారని తెలిపారు. పంట తీసుకున్న తర్వాత వృథాగా పోతున్న మొక్కజొన్న, కందులు, మినుము, శెనగ తదితర మొక్కలను రైతులనుంచి సేకరించి వాటికి పోషకాలను జోడించి దాణామృతాన్ని ఈ యూనిట్లు తయారుచేస్తాయని మంత్రి వివరించారు. దాణామృతం తయారీలో ఎక్కడా నాణ్యత లోపం ఉండరాదని, ఆలాగే పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని మంత్రి ఈ యూనిట్ల పారిశ్రామికవేత్తలకు స్పష్టం చేశారు. సంపాదనే కాదు, రైతు సంక్షేమం పశువుల ఆరోగ్యం కూడా ముఖ్యమన్నది గుర్తుంచుకోవాలని తెలిపారు. పాడిరైతుందరూ ఈ దాణామృతాన్ని వినియోగించుకొని లబ్భిపొందాలని కోరారు. పశువుల్నిఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసుకొనేందుకు పాడిరైతులకు వెసులుబాటు కల్పించామని మంత్రి పేర్కొంటూ ఇలా సరిహద్దు పొరుగు రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన పశువుల్ని స్వగ్రామాలకు తీసుకువచ్చేందుకు రవాణా వ్యయాన్ని సమకూర్చాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని చెప్పారు.పశువులకు చేస్తున్న బీమా ప్రీమియంను కూడా తగ్గించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి ఈ సంధర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి పేర్కొన్నారు. దాణామృతం తయారీ యూనిట్ల ఏర్పాటుకు తోడు గ్రామాల్లో మోగా పశుగ్రాస క్షేత్రాలను కూడా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. పాడిపరిశ్రమ, మత్స్య పరిశ్రమ అభివృద్ధి పట్ల ముఖ్యమంత్రి ఎంతో కృత నిశ్చయంతో ఉన్నారని ఈ రెండు రంగాల్లో సరికొత్త ఆధునిక వసతులన్నీ కల్పిస్తున్నామని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ డైరక్టర్ సోమశేఖర్ తదితరులు పాల్గొన్నారు.