చిక్కుల్లో ఫేస్ బుక్

చిక్కుల్లో ఫేస్ బుక్
March 21 15:05 2018

న్యూయార్క్,
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ చిక్కుల్లో పడింది. ఫేస్‌బుక్ సమాచారం లీకైనట్టు వచ్చిన ఆరోపణలతో సంస్థ అధినేత జుకర్‌బర్గ్‌ను విచారణ సంస్థలు ప్రశ్నించారన్న వార్తలు రావడంతో కంపెనీ షేర్‌లు భారీగా పతనమయ్యాయి. వాల్‌స్ట్రీట్‌లో సోమవారం ఒక్కరోజే.. ఫేస్‌బుక్ షేర్ విలువ 7 శాతం మేర పడిపోయింది. గడిచిన నాలుగేళ్లలో ఒకే రోజులో షేర్ విలువ భారీ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. రాజకీయ ప్రయోజనాల కోసం ఫేస్‌బుక్ నుంచి దాదాపు 5 కోట్ల మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీకైందని వచ్చిన ఆరోపణలు వెల్లువెత్తాయి. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలో డొనాల్డ్ ట్రంప్ కోసం ఈ సమాచారాన్ని కేంబ్రిడ్జ్ అనలిటికా చోరీ చేసినట్టు అమెరికా, బ్రిటన్ మీడియాలో కథనాలు వచ్చాయి. ట్రంప్ ఎన్నికల ప్రచారం కోసం పనిచేసిన కన్సల్టెన్సీకి ఫేస్‌బుక్ వినియోగదారుల వివరాలు ఎలా లభించాయన్న దానిపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను అమెరికా, ఐరోపా విచారణ సంస్థల అధికారులు ప్రశ్నించనున్నారని కూడా వార్తలు వెలువడ్డాయి. దీంతో ఫేస్‌బుక్ సహా పలు టెక్ దిగ్గజ సంస్థలపై ఆయా ప్రభుత్వాలు ఆంక్షలు విధించబోతున్నాయని ప్రచారం జరిగింది. ఇది మదుపుదార్లలో గుబులురేపడంతో ఒక్కసారిగా ఫేస్‌బుక్ షేర్లు భారీగా కుప్పకూలాయి. షేరు మార్కెట్ విలువ 7 శాతం మేర పడిపోయింది. దీంతో క్షణాల్లో 2.60 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది.