కాంగ్రెస్ కు ఫేస్ బుక్ మకిలీ

కాంగ్రెస్ కు ఫేస్ బుక్ మకిలీ
March 22 14:13 2018

న్యూఢిల్లీ,
ఫేస్‌బుక్’ డేటా ప్రైవసీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో తమకు సంబంధాలు లేవని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఆ సంస్థ సేవలను 2010లో బీజేపీ, జేడీయూ ఉపయోగించుకున్నాయని పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణదీప్ సుర్జేవాలా బుదవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ సేవలను ఎన్నడూ ఉపయోగించుకోలేదన్నారు. ఆ సంస్థతో తమకు సంబంధాలు ఉన్నాయని బీజేపీ బూటకపు ఎజెండాతో ఆరోపణలు చేస్తోందని, ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. బీజేపీని బూటకపు వార్తల కర్మాగారమని, ఈరోజు మరొక బూటకపు వార్తను ఉత్పత్తి చేసిందని ఆరోపించారు. బూటకపు ప్రకటనలు, బూటకపు విలేకర్ల సమావేశాలు, మాయపూరిత ఎజెండాలు బీజేపీకి, న్యాయంలేని న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ప్రతి రోజూ అలవాటేనన్నారు.కేంబ్రిడ్జ్ అనలిటికా వెబ్‌సైట్‌ను చూసినపుడు 2010లో బీజేపీ, జేడీయూ పార్టీలు ఆ సంస్థ సేవలను వినియోగించుకున్నట్లు వెల్లడవుతోందని సుర్జీవాలా అన్నారు. ఆ సంస్థకు చెందిన భారతీయ భాగస్వామి ఒవ్లీన్ బిజినెస్ ఇంటెలిజెన్స్‌ను బీజేపీ మిత్ర పక్ష పార్టీ ఎంపీ కుమారుడు నడుపుతున్నారన్నారు. ఈ కంపెనీ సేవలను 2009లో రాజ్‌నాథ్ సింగ్ ఉపయోగించుకున్నారని పేర్కొన్నారు.అంతకుముందు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై సూటి ప్రశ్నలు సంధించారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థతో కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఉన్న సంబంధాలు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ సోషల్ మీడియా ప్రొఫైల్‌లో కేంబ్రిడ్జ్ అనలిటికా పాత్ర ఏమిటో వెల్లడించాలని కోరారు. ఓట్లను పొందడం కోసం కాంగ్రెస్ పార్టీ డేటా మానిప్యులేషన్, చౌర్యంపై ఆధారపడుతుందా? అని అడిగారు.‘ఫేస్‌బుక్’ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా రవిశంకర్ ప్రసాద్ హెచ్చరించారు. భారతదేశ ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేసేందుకు అవాంఛనీయ మార్గాల్లో రహస్యంగా లేదా బహిరంగంగా ఫేస్‌బుక్‌తో సహా సోషల్ మీడియాను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. భారతదేశ ఐటీ చట్టం ప్రకారం తమకు విశేష అధికారాలు ఉన్నాయని తెలిపారు. ఇటువంటి చర్యలకు పాల్పడితే మార్క్ జుకర్‌బర్గ్‌ను కూడా భారతదేశానికి రప్పించే అధికారం ఉందన్నారు. ప్రస్తుతం ఫేస్‌బుక్ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. కేంబ్రిడ్జ్ అనలిటికాపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అనుమతి లేకుండా 5 కోట్ల మంది ఫేస్‌బుక్ యూజర్ల డేటాను కేంబ్రిడ్జ్ అనలిటికా పొందినట్లు ఆరోపణలు రావడంతో సంచలనం రేగింది. ఈ డేటాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు బ్రెగ్జిట్ ప్రచారం కోసం సహా రాజకీయ నేతల కోసం వినియోగించినట్లు తెలుస్తోంది.

  Article "tagged" as:
  Categories: