మందులెక్కడ..?

మందులెక్కడ..?
March 13 20:14 2018

శ్రీకాకుళం,
ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులు మందులు దొరక్క గగ్గోలు పెడుతున్నారు. విటమిన్‌-ఏతో బాధపడుతున్న లక్షల మంది చిన్నారులకు డ్రాప్స్‌ అంది ఏడాది అవుతోంది. ఇక మిగిలిన రోగులకు ఇచ్చే బీ-కాంప్లెక్స్‌ మాత్రల సరఫరా ఆరు నెలలుగా నిలిచిపోయింది. వీటిని బయట కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో ప్రజలు రక్తహీనత, ఎముకల బలహీనత, పోషకాహారం లోపంతో బాధపడుతుంటారని వివిధ నివేదికలు చెబుతున్నాయి. వీరికి కాల్షియం గుళికలు క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఐరన్‌ ఫోలిక్‌ యాసిడ్‌ లార్జ్‌ మాత్రలు సైతం అందుబాటులో లేవు. గర్భిణులకు ఇవి అత్యవసరం. ఐరన్‌ సుక్రోజ్‌ ఇంజెక్షన్‌ కూడా ఇవ్వడం లేదు. ఇదే సమయంలో నాణ్యత లేని మందులకు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి.
శాంపిల్‌ పరీక్షలో విఫలమైన మందులు కూడా ఈ జాబితాలో ఉండటం వైద్యవర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఎసిటైల్‌ సాలిసిక్‌ యాసిడ్‌-150 ఎంజీ(లాకెమికో), డైక్లోఫెనాక్‌ సోడియం(గ్రీన్‌ల్యాండ్‌ ఆర్గానిక్‌), డెకాడ్రాన్‌ ఇంజెక్షన్‌(ఆల్పాలేబరేటరీస్‌), ఎమైకాసిన్‌ 500ఎంజీ ఇంజెక్షన్‌(ఎరీనోహెల్త్‌కేర్‌), ఆన్‌డిస్ట్రియిన్‌ మాత్రలు(రాడికో), లోపరమైడ్‌ (రాడికో), గ్లిబిన్‌క్లయిమేడ్‌(గ్రీన్‌లాండ్‌ ఆర్గానిక్‌), గ్లిమిప్రయిడ్‌ 2ఎంజీ(సీజన్స్‌ హెల్త్‌కేర్‌) వంటి మందులు వెనక్కి పంపిన వాటిల్లో ఉన్నట్లు శ్రీకాకుళం వైద్యులు చెప్తున్నారు.
పుట్టిన ప్రతి చిన్నారికి తొమ్మిదో నెల నుంచి 5 ఏళ్లు వచ్చే వరకూ 6 నెలలకోసారి విటమిన్‌-ఏ డ్రాప్స్‌ ఇవ్వాలి. దీనివల్ల రే చీకటి, చర్మవ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. పైగా చిన్నారుల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవేమీ ఆరోగ్యశాఖ అధికారులకు పట్టడం లేదు. నిబంధనల ప్రకారం ఆరోగ్యశాఖ ఏటా రెండుసార్లు(మార్చి, సెప్టెంబరు) ప్రజల్లో అవగాహన కోసం ప్రచారం చేస్తుంది. కానీ, గత ఏడాది మార్చి తర్వాత దీనిని చేపట్టలేదు. సాధారణంగా పిల్లల్లో రోగ నిరోధిక శక్తి తక్కువగా ఉంటుంది. మన రాష్ట్రంలో పౌష్ఠికాహార లోపంతో 60శాతం చిన్నారులు బాధపడుతున్నారు. వీరందరికీ విటమిన్‌-ఏ అత్యవసరం. పైగా సీజనల్‌ వ్యాధులు విజృంభించడంతో చాలామంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు.
ఈ అంశంపై ప్రచారం నిలిచిపోవడానికి ఏపీఎస్‌ఎంఐడీసీ అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.. విటమిన్‌-ఏ డ్రాప్స్‌ను దిగుమతి చేసుకుని జిల్లాలకు పంపించాల్సిన బాధ్యత ఏపీఎ్‌సఎంఐడీసీ అధికారులదే. గత ఏడాది డ్రాప్స్‌ కొనుగోలు చేసి జిల్లాలకు సరఫరా చేశారు. చివరి నిమిషంలో డ్రాప్స్‌ గడ్డకట్టినట్లు గుర్తించి ప్రచారం నిలిపివేశారు. మందు వెనక్కి తీసేసుకున్నారు. ఆ తర్వాత విటమిన్‌-ఏ డ్రాప్స్‌ పంపించే వారే కరువయ్యారు.
నిబంధనల ప్రకారం విటమిన్‌-ఏ లాంటి కీలక మందుల కొనుగోళ్లు నేరుగా తయారీ కంపెనీ నుంచే చేయాలి. కానీ ఏపీఎస్‌ఎంఐడీసీ అధికారులు డిస్ట్రిబ్యూటర్‌ దగ్గర నుంచి కొనుగోలు చేసినట్లు సమాచారం. దీనివల్లే ఏడాది కిందట సమస్య ఏర్పడిందని, ఆరోగ్యశాఖకు రూ.30 కోట్ల నష్టం వచ్చిందని చెబుతున్నారు. అప్పట్లో వేసిన విచారణ కమిటీ ఏం తేల్చిందో ఎవరికీ తెలియదు. డిస్ట్రిబ్యూటరీ కంపెనీని పక్కనపెట్టి నేరుగా తయారీ కంపెనీకే ఆర్డర్‌ ఇచ్చినా ఇంకా డ్రాప్స్‌ దిగుమతి జరగలేదు.

  Article "tagged" as:
  Categories: