నదుల మహా సంగమంతో కరవుకు చెక్

నదుల మహా సంగమంతో కరవుకు చెక్
March 13 19:56 2018

అమరావతి
గోదావరి-పెన్నా, గోదావరి-కృష్ణా, వంశధార-నాగవళి అనుసంధానాలతో కలిపి మహా సంగమం ద్వారా ఏపీలో కరవుకు చెక్ పెట్టనున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో మరో రెండు ప్రాజెక్టులను ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా ప్రభుత్వం గుర్తించిందన్నారు. వాటితో కలిపి రాష్ట్రంలో 52 ప్రాజెక్టులను ప్రాధాన్యాతపరంగా గుర్తించగా, వాటిలో ఇప్పటికే 8 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాన్నారు. ప్రస్తుతం ప్రారంభానికి 5 ప్రాజెక్టులు సిద్ధంగా ఉండగా, వచ్చే జూన్ నాటికి 15 ప్రాజెక్టులను పూర్తి చేయనున్నామన్నారు. ఇవే కాకుండా ఈ ఏడాది డిసెంబర్ నాటికి, వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించిందన్నారు. సచివాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం – పోలవారంగా గుర్తించి సీఎం చంద్రబాబునాయుడు 53వ వర్చువల్ సమావేశాన్ని సచివాలయంలో సోమవారం నిర్వహించారన్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టులో చేపట్టిన పనుల వివరాలను సీఎం చంద్రబాబునాయుడుకు అధికారులు వివరించారన్నారు. గత వారం నుంచి పోలవరం కాంక్రీట్ పనులు వేగవంతంగా సాగుతున్నాయని తెలిపారన్నారు. ఈ ఏడాది మే నాటికి డయాఫ్రమ్ వాల్, జూన్ 15 నాటికి జెట్ గ్రౌంటింగ్ పనులు పూర్త అవుతాయని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 54.4% పూర్తి అయిందన్నారన్నారు. కుడి ప్రధాన కాలువ 91%, ఎడమ ప్రధాన కాలువ 59.6%, హెడ్ వర్క్స్ 41.2% పూర్తయ్యాయన్నారు. మొత్తం తవ్వకం పనులు 70% పూర్తయ్యాయన్నారు. 1115.59 లక్షల క్యూబిక్ మీటర్లకు గాను 778.80 లక్షల క్యూబిక్ మీటర్ల మేర తవ్వకం పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు. స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు 16% , డయాఫ్రమ్ వాల్ 72%, రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయ్యిందన్నారు. స్పిల్‌వే, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, గేట్లకు సంబంధించి మొత్తం 42 డిజైన్లకు గాను ఇప్పటివరకు 14 డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదించిందన్నారు. మరో 16 డిజైన్లను సమర్పించడం జరిగిందన్నారు.ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో మరో రెండు..రాష్ట్రంలో చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో మరో రెండింటిని చేర్చాలని సీఎం చంద్రబాబుఆదేశించినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. కర్నూలు జిల్లాలోని గుండ్రేవుల రిజర్వాయర్, తోటపల్లి కుడి, ఎడమ కాలువల అభివృద్ధి పనులు కొత్తగా చేపట్టనున్నామన్నారు. దీంతో రాష్ట్రంలో చేపట్టిన ప్రాధాన్యత ప్రాజెక్టుల సంఖ్య 52కు చేరిందన్నారు. ఈ ప్రాధాన్యతా ప్రాజెక్టులలో ఇప్పటివరకు 8 ప్రాజెక్టులు ప్రారంభించామని మంత్రి తెలిపారు. మరో 5 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఇవే కాక, మరో 15 ప్రాజెక్టులు ఈ ఏడాది జూన్ 15 నాటికి సిద్ధం కానున్నాయన్నారు. మిగిలిన ప్రాజెక్టులు ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. జల సంరక్షణ ఉద్యమంలో భాగంగా రూ. 247 కోట్ల విలువైన పనులు చేపట్టినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. గడిచిన 30 రోజుల్లో శరవేగంగా చెరువుల పునరుద్ధరణ, చెక్ డ్యామ్‌లు, పంటకుంటలు, కాలువలు, డ్రైయిన్ల అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. పోలవరం గ్రౌండ్ ఇంజినీరింగ్ పనులు చేపిట్టిన కెల్లర్ గ్రౌండ్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ‘సీఐడీసీ విశ్వకర్మ అవార్డు-2018’ కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగాకెల్లర్ గ్రౌండ్ ఇంజినీరింగ్ సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించినట్లు మంత్రి తెలిపారు.