తాతా పాత్రలో నాగచైతన్య

తాతా పాత్రలో నాగచైతన్య
March 12 13:12 2018

హైద్రాబాద్,
అలనాటి అందాల తార సావిత్రీ జీవితాధారంగా తెరకెక్కుతున్న ‘మహానటి’ సినిమాలో భారీ తారాగణమే కనిపించనుంది. కీర్తి సురేష్ ప్రధాన పాత్రపోషిస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే కొన్ని కీలక పాత్రలకు నటీనటులను ఎంపిక చేశారు. అయితే, అప్పట్లో ఓ వెలుగు వెలిగిన ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రల్లో ఎవరు నటిస్తారనే విషయంపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రకు జూనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ పాత్రకు నాగచైతన్యలను సంప్రదించారు.అయితే, ఎన్టీఆర్ ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించాడు. నాగచైతన్య కూడా మొదట్లో తిరస్కరించినా ఇప్పుడు అంగీకరించాడు. ఈ నేపథ్యంలో తాత అక్కినేని నాగేశ్వరరావు పాత్రలో ఎలా ఇమిడిపోతాడనేది తెరపై చూడాల్సిందే. ఏఎన్నార్‌ పాత్రకు చైతూ ఖరారైన నేపథ్యంలో ఎన్టీఆర్ పాత్రకు కూడా స్టార్ నటుడినే ఎంపిక చేయాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.ఈ నెల 14, 15 తేదీల్లో నాగచైతన్యకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసేలా చిత్రయూనిట్ ప్లాన్ చేశారు. అయితే, ఈ సినిమాలో ఏఎన్నార్, ఎన్టీఆర్ పాత్రలు అతిథి పాత్రల్లాంటవని, సినిమాలో సింహ భాగం సావిత్రి పాత్ర చుట్టూనే తిరుగుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌ను మరోసారి సంప్రదించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఎస్వీ రంగరావు పాత్రకు మోహన్ బాబును ఎంపిక చేశారు. భానుమతి పాత్రలో అనుష్కను సెలక్ట్ చేసినట్లు తెలిసింది. సమంత, విజయ్ దేవర కొండ, ప్రకాష్ రాజ్‌లు కూడా కీలక పాత్రలో కనిపిస్తారు.