సభ సజావుగా జరిగితేనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగలం

సభ సజావుగా జరిగితేనే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టగలం
March 16 16:21 2018

న్యూఢిల్లీ
కేంద్రప్రభుత్వంపై తెదేపా, వైకాపా పెట్టిన అవిశ్వాస తీర్మానాలపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహజన్‌ స్పందించారు. అవిశ్వాస తీర్మానాలు తనకు అందాయని.. అయితే సభ సజావుగా జరిగితేనే వీటిని ప్రవేశపెట్టగలమని పేర్కొన్నారు. ఇలాగే గందరగోళ పరిస్థితులు నెలకొంటే తీర్మానాలను తీసుకురాలేమని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపిస్తూ వైకాపా కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఇందుకు తెదేపా కూడా మద్దతివ్వాలని భావించింది. అయితే తామే సొంతంగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని శుక్రవారం జరిగిన తెదేపా పొలిట్‌బ్యూరో సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెదేపా, వైకాపా వేర్వేరుగా అవిశ్వాసతీర్మానాలనుతీసుకొస్తున్నాయి.తెదేపా, వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలను స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభలో చదివి వినిపించారు. వాటికి ఎంతమందిమద్దతు ఇస్తున్నారన్న దాన్ని పరిగణనలోకి తీసుకుని చర్చిస్తామని స్పీకర్‌ చెప్పడంతో కాంగ్రెస్‌, సీపీఎం సహా వివిధ పార్టీల సభ్యులు తమ తమ స్థానాల్లో లేచి నిలబడ్డారు. దీంతో వాటిపై చర్చ చేపట్టేందుకు స్పీకర్‌ సిద్ధమైన సమయంలో తెరాస, అన్నాడీఎంకే సభ్యులు ఆందోళన చేపట్టారు.విపక్షాల నిరసనల నేపథ్యంలో నేడు కూడా లోక్‌సభ సజావుగా జరగలేదు. దీంతో అవిశ్వాసంపై చర్చ లేకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. కాగా.. తెదేపా అవిశ్వాస తీర్మానానికి పలు విపక్ష పార్టీలు మద్దతిస్తున్నాయి.