సిరియాలో సమిధలవుతున్న సామాన్యులు

సిరియాలో సమిధలవుతున్న సామాన్యులు
March 02 12:21 2018
(విశ్లేషణ)
సిరియాలో భయానక నరసంహారం సాగు తోంది. ఎక్కడ చూసినా శవాల గుట్టలు, పసిపిల్లలు, మహిళలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో యుద్ధ కేంద్రిత తూర్పు గౌటా నగరమంతా భూలోక నరక కూపంలా మారింది. బషర్ అల్ అసద్ ప్రభుత్వ బలగాలకు, ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటు దారులకు మధ్య భీకర ఆధిపత్య పోరుతో జనావాసాలు మృత్యు కాసారాలుగా మారాయి. తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న గౌటాను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అసద్ ప్రభుత్వ బలగాలు వారం రోజులుగా జరుపుతున్న దాడుల్లో రెండువందల మందికి పైగా పిల్లలు సహా ఏడు వందల మంది పౌరులు మరణించారు. వేలాదిగా క్షతగాత్రులయ్యారు. మానవ కవచాలుగా పౌరులను తిరుగుబాటుదారులు వినియోగించు కుంటుంటే, జనావాస ప్రాంతాలపై ప్రభుత్వ బలగాలు వైమానిక, రసాయనిక ఆయుధాలతో అమానుషంగా చేస్తున్న దాడుల్లో ప్రజలు బలైపోతున్నారు. సిరియాలో అనేక ప్రాంతాల్లో అపజయాన్ని చవిచూసిన ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ గౌటాలో కేంద్రీకృతమై ఉండడంతో ఆ నగరంపై ప్రభుత్వ బలగాలు భీకర దాడులకు తలపడ్డాయి.నిజమే యుద్ధం లేదా అంతర్యుద్ధమంటే ఆషా మాషిగా, అలవోకగా చేసే వినోదక్రీడ కాదు. రాజ కీయాధిపత్యం కోసం విభిన్న సామాజిక వర్గ శక్తులు నిర్దాక్షిణ్యంగా ఒకరినొకరు నిర్మూలించుకునే రక్తసిక్త కార్యకలాపమే యుద్ధం. అయితే సులభ లక్ష్యాలుగా ఉన్న ప్రజలపై రక్తపాతాన్ని సృష్టించడం యుద్ధ నియ మం కారాదు. అంతర్యుద్ధాల్లో పరస్పరం తలపడు తున్న వైరిపక్షాల రాజకీయ దృక్పథాలను (వర్గ, మత, జాతి తదితర) బట్టి యుద్ధ స్వభావం, ప్రజలకు తలపడే విరుద్ధ శక్తులకు మధ్య సంబంధం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కార్మికవర్గ వర్గ దృక్ప థంతో తలపడే సాయుధ శక్తులకు పాలకవర్గాలు, వారి కోసం పనిచేస్తున్న సాయుధ బలగాలు లక్ష్యమైతే, జాతి లేదా మత లేదా ఆధిపత్యవర్గ దృక్పథంతో కొట్లాడే శక్తులకు తాము శత్రువుగా భావించే కార్మిక వర్గ పోరాట సంస్థలు, వారికి మద్దతు ఇచ్చే ప్రజలు లేదా జాతీయులందరూ యుద్ధ లక్ష్యాలుగా మారుతారు. దాంతో అంతర్యుద్ధం భీకర వర్గపోరాటంగాను లేదా జాత్యహంకార మారణకాండగాను పరిణమిస్తుంది. సిరియాలో నడుస్తున్న ఈ యుద్ధంలో ఏ శక్తి గెలిచినా ప్రజలకు ఏ మేరకు ఉపయోగ పడగలదన్నది సందేహమేగానీ, యుద్ధం పేరుతో వారికి భూలోక నరకాన్ని చూపిస్తున్నందుకు ఇరుపక్షాలను చరిత్ర క్షమించదు. గౌటా నగర మృత్యు క్షేత్రంలో చిక్కుకున్న నాలుగు లక్షల మంది ప్రజల ప్రాణాలకు ఎలాంటి విలువ లేకపోవడంపై అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ప్రతి స్పందించింది.యుద్దంలో గాని, సాయుధ అంతర్యుద్ధం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో సాయుధ శక్తులు వ్యవహరిస్తున్న తీరును పౌర/మానవ హక్కుల పరిధిలో మాత్రమే ప్రశ్నించడంతో సరిపోదు. సాధారణ ప్రజా ఉద్యమాలపై జరిగే ప్రభుత్వ నిర్బంధం పౌర హక్కుల పరిధిలోకి వస్తుంది. అదే రెండు సాయుధ శక్తుల మధ్య సాగే యుద్ధ స్వభావం (సాయుధ పోరాటం) ఐక్యరాజ్య సమితి యుద్ధ నియమాలకు అనుగుణంగా ఉన్నాయా లేక జన హనన రసాయనిక, జీవ రసాయనిక, నాపాం/డర్టీ బాంబు (అణు ధూళి)/ అణుబాంబుల వంటి వాటిని వినియోగిస్తున్నాయా అనే అంశాల పునాదిగా ఆ దేశ/ప్రాంత ప్రజల హక్కుల కోసం డిమాండ్ చేయ వలసి ఉంటుంది. సిరియా రాజధాని డమస్కస్ శివారు నగరమైన గౌటా 2013లో ప్రభుత్వ బలగాల ఆధీనంలో ఉండేది. అయితే మిగతా ప్రాంతాల్లో సిరియన్ దాడులతో చావుదెబ్బ తిన్న మిలిటెంట్లు వేల మంది, సాధారణ పౌరులతో కలగలసిపోయి గౌటా నగరంలోకి చొరబడ్డారు. 2017 నాటికి గౌటానగరం తిరుగుబాటుదార్ల వశమైంది. త హ్రీర్ అల్‌షమ్, అల్ రహమాన్ లీజియన్, జౌష్ అల్ ఇస్లామ్ అనే గ్రూపులు తరచూ పరస్పరం ఆధిపత్య పోరు కొనసాగిస్తూ, ప్రభుత్వ బలగాలతో తలపడు తుండడంతో జనజీవనం మృత్యువిలయంగా మారింది. డమాస్కస్‌కు 10 కిలోమీటర్ల దూరంలో వంద చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న గౌటా నగరంపై పట్టు సాధించడం ప్రభుత్వ బలగాలకు కీలకం. ‘తక్షణమే సిరియాలో కాల్పుల విరమణ ఒప్పందం అమలు చేయాలి’ అని ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి తీర్మానం చేసినా, సంతకం చేసిన రష్యా ప్రత్యక్ష సహకారంతో అస్సాద్ ప్రభుత్వ సాయుధ బలగాలు భీకర బాంబు దాడులను కొనసాగిస్తూనే ఉన్నాయి. ‘రోజుకు ఐదు గంటలపాటు కేటాయించిన దాడుల విరామ సమయం’ లోనూ దాడులు కొనసాగుతూనే ఉండడంతో గౌటా యుద్ధ క్షేత్రంలో నెత్తురు ఏరులా పారుతోంది. అమెరికా మిత్రపక్షాలు సిరియా-రష్యా అమానుష సైనిక దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నా, తెర వెనుక తిరుగు బాటుదారులకు సహాయం చేస్తూనే ఉన్నాయన్న మీడియా కథనాలు ఉన్నాయి. భౌగోళిక ఆధిపత్య రాజకీయ మృత్యుక్రీడ నేడు సిరియా కేంద్రంగా సాగుతోంది. 2011లో మధ్య ప్రాచ్యంలో సుదీర్ఘకాలంగా పాలన సాగిస్తున్న నిరం కుశ రాజ్యాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ‘అరబ్ వసంతం’ పేరుతో  వెల్లువెత్తాయి. ఆ క్రమంలోనే సిరియాలో అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుతంగా ప్రారంభమైన నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా అణచివేతకు గురయ్యాయి. అసద్ ప్రభుత్వం వైదొలగాలని ప్రారంభమైన శాంతియుత నిరసనోద్యమం క్రమంగా అమెరికా సారథ్యంలోని నాటో కూటమి సహకారంతో సాయుధ పోరాట మార్గాన్ని చేపట్టింది. సిరియాలో అంతర్యుద్ధం అనేక ముఠాల మధ్య నిరంతరాయంగా, భీకరంగా సాగుతోంది. సిరియా ప్రభుత్వం, దాని మిత్ర పక్షాలకు ‘ఫ్రీ సిరియన్ ఆర్మీ’, ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవంట్ (ఐఎస్‌ఐఎల్ లేదా ఐఎస్‌ఐఎస్ – ఇస్లామిక్ స్టేట్), ప్రభుత్వ/తిరుగుబాటుదారులకు మద్దతుగా సరిహద్దు దేశాలకు చెందిన సాయుధ మూకలు ఇలా అనేక ముఠాలు పరస్పరం యుద్ధం చేస్తున్నాయి. అసద్ ప్రభుత్వానికి మద్దతుగా ఇరాన్, రష్యా, హిజ్‌బుల్లా సంస్థలు పనిచేస్తున్నాయి. 2015 నుంచి తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా రష్యా వైమానిక దాడులు నిర్వహిస్తున్న నాటి నుంచి సిరియాలో మానవత్వ సంక్షోభం క్రమంగా పరాకాష్ఠకు చేరింది. మరో వైపు, అమెరికా సైనిక బలగాల కూటమి ఇస్లామిక్ స్టేట్  మిలిటెంట్ల స్థావరాలపైనే కాక, రష్యా అనుకూల అసద్ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంతో ప్రభుత్వ సైనిక స్థావరాలపై కూడా వైమానిక దాడులు చేస్తోంది.సిరియా అంతర్యుద్ధానికి చరమగీతం పాడేందు కు 2017 నుంచి ఐక్యరాజ్య సమితి శాంతి చర్చలు ప్రారంభించినా ప్రయోజనం శూన్యం. 2008 నుంచి సాగుతున్న ప్రపంచ ఆర్థిక సంక్షోభం పర్యవసానంగా ఫాసిస్టు/అర్థ ఫాసిస్టు/ఫాసిస్టు ధోరణి గల ప్రభుత్వా లు ఉనికిలోకి వచ్చాయి. అమెరికా ఏకధ్రువ ప్రపంచాన్ని సవాలు చేస్తూ రష్యా, ఈయూల దన్నుతో సామ్రాజ్యవాద కాంక్షతో దూకుడుగా ముందుకొస్తున్న చైనా కూటమికి మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం భూగోళంపై మరెన్ని సిరియా తరహా మారణహోమాలకు దారితీస్తుందో చెప్పలేము. మొదటి ప్రపంచయుద్ధ కాలంనాటి పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయని విశ్లేషకుల అంచనా. సరికొత్త రూపంలో సాగుతున్న సమకాలీన ప్రచ్ఛన్న యుద్ధ సన్నివేశాన్ని, దాని పర్యవసానాలను నివారించేందుకు ప్రపంచ శాంతికోసం మరోసారి అంతర్జాతీయ రాజకీయ యవనికపై 1960ల నాటి ప్రపంచవ్యాప్త అంతర్యుద్ధానికి ప్రజలు ఐక్యంగా ఉద్యుక్తులవ్వాల్సిన తరుణమిది. భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా మత, జాతి, కుల తదితర రూపాల్లో విద్వేషకాండలను, మారణ హోమాలకు కారణమవుతున్న సామ్రాజ్య వాద శక్తులకు, ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా పరస్పర సహ కారంతో ఎక్కడికక్కడ ప్రజా పోరాటాలు పెల్లుబికితేనే ప్రపంచ శాంతికి మార్గం సుగమం అవుతుంది.