వేగంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు: హరీష్‌రావు

వేగంగా ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు: హరీష్‌రావు
March 23 17:35 2018

హైదరాబాద్,
నల్లగొండ జిల్లాలోని ఉదయ సముద్రం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. శాసనసభలో ఉదయం సముద్రం ప్రాజెక్టు పనులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ల కోసం పంపులు, పైపులు తెచ్చి పెట్టారు. కానీ పనులు జరగలేదు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా 2014వరకు పనులు ముందుకు పోలేదు. పంప్ హౌజ్, టన్నెల్ పనులు జరగలేదు. బిల్లులు మాత్రం తీసుకున్నారు. కరువు పీడిత ప్రాంతాలకు వెళ్లే ప్రాజెక్టు ఇది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసిందన్నారు. ఇప్పటి వరకు రూ. 125 కోట్ల పని పూర్తి అయిందన్నారు. నకిరేకల్, మునుగోడు, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగు నీరు అందిస్తామన్నారు. పంప్‌హౌజ్,లైనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు కింద వాన కాలం పంటకు నీరు అందిస్తాం. 40 చెరువులను నింపుతామని హరీష్‌రావు వెల్లడించారు.