పలు గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల

పలు గ్రామాల్లో మిషన్ కాకతీయ పనులను ప్రారంభించిన మంత్రి అల్లోల
March 16 16:11 2018

హైదరాబాద్,

దేశంలో ఎక్కడ లేని విధంగా 2018-19 బడ్జెట్ కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి సీయం కేసీఆర్ పెద్దపీట వేశారని గృహ నిర్మాణ,న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.వ్యవసాయానికి రూ.12 వేల కోట్లు,రైతు సంక్షేమానికి రూ,8 వేల కోట్లు,రైతు బీమా కోసం రూ.500 కోట్లు కేటాయించారని తెలిపారు. ఈ పథకం కింద ప్రతి రైతుకు రూ.5 లక్షల వరకు ఉచితంగా బీమా సౌకర్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలోని పలు గ్రామాల్లో నాల్గవ విడత మిషన్ కాకతీయ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. నిర్మల్ మండలం భాగ్యనగర్ లో రూ.28.50 లక్షలు, న్యూ పోచంపహాడ్ లో రూ.22.30 లక్షలు, లక్ష్మణచాంద మండలం పార్ పల్లి లో 65.82 లక్షలతో చేపట్టిన మిషన్ కాకతీయ పనులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. సాగునీటీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధన్యతనిస్తుందన్నారు. ఈ బడ్జెట్ లో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయింపులు చేసినట్లు తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు,వాటి మౌలిక వసతుల కల్పన కోసం రూ.500 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.