మిర్చి రైతు కంట కన్నీరు

మిర్చి రైతు కంట కన్నీరు
March 23 17:57 2018

ఖమ్మం,
అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా తయారైంది మిర్చి రైతుల పరిస్థితి. గత ఏడాది ధర లేక తీవ్రంగా నష్టపోయిన రైతులు.. ఈ సారి రికార్డు స్థాయిలో ధర పలుకుతున్నా నష్టపోక తప్పని పరిస్థితి నెలకొంది. జెమిని వైరస్‌ ప్రభావంతో దిగుబడులు సగానికిపైగా తగ్గడంతో ఆదాయం వచ్చే సూచనలేమీ కనిపించడం లేదని రైతులు వాపోతున్నారు. రంగుల్లో వినియోగించే బ్యాగడ రకం మిర్చి అత్యధికంగా క్వింటాల్‌కు రూ.14వేలు పలుకుతున్నా ఆశించిన స్థాయిలో రాబడి రాలేదని చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టు కింద ఖరీఫ్‌లో చాలా మంది రైతులు మిరప, చెరుకు సాగుకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల్లో మిరప సాగైంది.
5వేల ఎకరాల్లో రంగుల్లో వినియోగించే మిర్చి, 20 వేల ఎకరాల్లో తినడానికి వినియోగించే మిరపను రైతులు సాగు చేశారు. సాధారణంగా ఎకరాకు సుమారు 20 నుంచి 25 క్వింటాళ్ల దిగుబడులు వస్తాయి. అయితే ఈ సారి జెమిని వైరస్‌ ప్రభావంతో మిర్చి దిగుబడులు అమాంతం తగ్గిపోయాయి. ఎకరాకు పది క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. జిల్లాలో మొత్తంగా 2.50 లక్షల క్వింటాళ్ల దిగుబడులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ మేరకు ఉండవల్లి మండలం ప్రాగటూర్‌తోపాటు చుట్టుపక్కల గ్రామాల్లో మిర్చి పంటను ఐటీసీ కంపెనీ నేరుగా కొనుగోలు చేసింది. క్వింటాల్‌కు రూ. 8200 ధరతోపాటు రూ.400 బోనస్‌ కూడా చెల్లించారు. మిగతా రైతులు పంటను కర్నూల్‌, హైదరాబాద్‌ మార్కెట్లకు తరలిస్తున్నారు. అయితే, దిగుబడులు తగ్గడంతో పెట్టుబడికి మాత్రమే డబ్బులు వచ్చాయని రైతులు చెబుతున్నారు. జిల్లాలో ఏటా రూ.200 కోట్ల విలువ చేసే మిర్చి దిగుబడి వస్తుండగా, ఈ సారి అది రూ.175 కోట్లకు పడిపోయింది. తెలంగాణలో కరీంనగర్‌, వరంగల్‌ తర్వాత గద్వాల జిల్లాలోనే రంగుల్లో వినియోగించే మిరప సాగు చేస్తారు. బ్యాగడ, ఢిల్లీ హాట్‌, వండర్‌ హాట్‌ రకాలు ఇటిక్యాల, మానవపాడు మండలాల్లో సుమారు 5వేల ఎకరాల్లో సాగైనట్లు ఉద్యానవన అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ తరహా మిర్చి క్వింటాల్‌కు రూ.12వేల నుంచి రూ.14 వేల వరకు ధర పలుకుతోంది. అయితే, బ్యాగడ రకం మిరపకు జెమిని వైరస్‌ సోకి దిగుబడులు సగానికిపైగా తగ్గిపోయాయి. సాధారణంగా ఎకరాకు 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సి ఉండగా, ఈ సారి 10 క్వింటాళ్లలోపే వచ్చింది.
గత సంవత్సరం క్వింటాల్‌ మిర్చి రూ.3వేల నుంచి రూ.5 వేల లోపు ధర పలికింది. దీంతో చాలా మంది రైతులు మిర్చి పంటను కోల్డ్‌ స్టోరేజీల్లో పెట్టారు. ఇప్పుడు ధర క్వింటాల్‌కు రూ.7000 నుంచి రూ.8000 పలుకుతుండడతో నిల్వ చేసిన మిర్చిని విక్రయానికి తీసుకొస్తున్నారు. ఇది కొంత మేర ఊరట కలిగిస్తున్నా.. ఈ ఏడాది రైతులకు మాత్రం నిరాశే మిగులుతోంది. మంచి ధర ఉన్నా దిగుబడి తగ్గడంతో నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది