ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం

ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికి ఆదర్శం
March 13 19:52 2018

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చ జరుగుతుంది. ఈ సందర్భంగా ధన్యవాద తీర్మానాన్ని కొప్పుల ఈశ్వర్ ప్రతిపాదించారు. రాష్ట్ర సమస్యలు పరిష్కరించడంలో సీఎం కేసీఆర్ కంటే మంచి నాయకుడు మరొకరు లేరని స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమపాళ్లలో అమలు చేస్తున్నారని చెప్పారు.2014 నుంచి రాష్ట్రంలో ఆర్థిక వృద్ధి రేటు గణనీయంగా ఉందని తెలిపారు. దేశ వృద్ధి రేటు 7.5శాతం ఉంటే రాష్ట్ర వృద్ధి రేటు 8.6 శాతం ఉందన్నారు. దేశ తలసరి ఆదాయం రూ. 1.03 లక్షలుగా ఉందన్నారు. రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1.56 లక్షలుగా ఉందని తెలిపారు. ఈ అంశాల ఆధారంగా రాష్ట్రంలో అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చన్నారు. రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తున్నామన్నారు. రైతులకు పంట పెట్టుబడి పథకం అమలు చేయబోతున్నామని పేర్కొన్నారు. రైతులకు బీమా సదుపాయం కూడా కల్పించబోతున్నామని స్పష్టం చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్న భూరికార్డులను ప్రక్షాళన చేశామని చెప్పారు. రైతులకు వ్యవసాయానికి 24గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తు చేశారు. 18 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాములను నిర్మించుకున్నామని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశామన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ ఉద్ఘాటించారు.

  Article "tagged" as:
  Categories: